
మౌలానా సయ్యద్ యూసుఫ్ (ర.అలై.) జీవితం! ఓ సందేశం !!
మౌలానా సయ్యద్ యూసుఫ్ (ర.అలై.) జీవితం! ఓ సందేశం !!
సయ్యద్ యూసుఫ్ 6, జులై , 1928వ సంవత్సరం నంద్యాల పట్టణం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు . ప్రాధమిక విద్య నంద్యాల పట్టణంలోనే అభ్యసించారు. హయ్యర్ సెకండరీ విద్య సి. ఆర్. రెడ్డి కాలేజీ, ఏలూరు నగరంలో అభ్యసించారు. 1955వ సంవత్సరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నత ఉద్యోగాన్ని పొందారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం అదేవిధంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో సెక్షన్ ఆఫీసర్ లాగా కూడా కొంత కాలం ఉద్యోగం కొనసాగించారు.
సయ్యద్ యూసుఫ్ మౌలానా మౌదూదీ (ర.అలై.) రచనలతో ఆకర్షితులై జమాత్ ఎ ఇస్లామీ ఉద్యమానికి దగ్గరయ్యారు. సయ్యద్ యూసుఫ్ ఇస్లామీయ ఉద్యమానికి దగ్గర కావటంలో మౌలానా అబ్దుర్రహీమ్, నంద్యాల కృషి ప్రధానమైనది. సయ్యద్ యూసుఫ్ ఆంగ్ల భాషలో అనేక రచనలు చేశారు. ఢిల్లీ నుండి ప్రచురించబడే రేడియన్స్ వార పత్రిక సంపాదకులుగా కూడా ఆయన సేవలు అందించారు. ముస్లిం పర్సనల్ లా, ఇస్లామీయ షరియత్ మొదలైన అంశాల మీద ఆంగ్లంలో ఆయన రచనలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ముస్లిం, ముస్లిమేతర సోదరులను దగ్గర చేయటానికి ఆయన అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. ఫోరమ్ ఫర్ డెమోక్రసీ అండ్ కమ్యూనల్ ఎమిటి (FDCA) స్థాపనలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. అనేక సంవత్సరాలు FDCA కార్యదర్శిగా కూడా సేవలు అందించారు.
సయ్యద్ యూసుఫ్ గొప్ప వక్త, రచయిత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జమాత్ విస్తరణ కొరకు ఆయన నిరంతరం కృషి చేశారు. తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ స్థాపనలో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ముస్లిమేతర మేధావులతో ఆయన సత్సంబంధాలు కలిగి ఉండే వారు. భారత రాజ్యాంగం, చట్టాల గురించి ఆయనకు అపారమైన అవగాహన ఉండేది. ఇస్లామీయ ఉద్యమ కార్యక్రమాల కొరకు ఉద్యోగం సర్వీస్ కంటే ముందే వదిలి పూర్తి జీవితాన్ని ఇస్లామీయ ఉద్యమానికి అంకితం చేశారు. మౌలానా అఫ్జల్ హుసైన్ (ర.అలై.) జమాత్ ఎ ఇస్లామీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయనకు మద్దతుగా సయ్యద్ యూసుఫ్ మర్కజ్ లో సేవలు అందించేవారు.
సయ్యద్ యూసుఫ్ ఇస్లామీయ ఉద్యమాన్ని తన వ్యక్తిత్వం వరకు పరిమితం చేయకుండా పూర్తి కుటుంబాన్ని ఇస్లామీయ ఉద్యమానికి దగ్గర చేశారు. ఆయన కుమారులు, కుమార్తెలు అందరూ నేడు ఇస్లామీయ ఉద్యమంలో ఉన్నారు. ఇస్లామీయ ఉద్యమంలో ప్రతినిధి మండలి సభ్యులుగా, రాష్ట్ర సలహా మండలి సభ్యులుగా, కేంద్ర సలహా మండలి సభ్యులుగా కేంద్రంలో (మర్కజ్) సెక్రెటరీగా అనేక బాధ్యతలు నెరవేర్చారు. ఇస్లామీయ ఉద్యమ సుదీర్ఘ ప్రయాణం తర్వాత 30, సెప్టెంబర్ ,1997వ సంవత్సరం ఇహలోకం వదిలి పరలోకానికి ప్రయాణించారు. అల్లాహ్ ఆయనకు స్వర్గంలో ఉన్నత స్థానాలు ప్రసాదించుగాక –